మత్తు పదార్థాలను నియంత్రించండి
నంద్యాల: వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఉన్నత విద్యా, తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మత్తు పదార్థాల నియంత్రణ అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి తదితర మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యకూడళ్లలో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు హోర్డింగ్‌లను ఏర్పాటు చేసి యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ యోగేంద్ర బాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం తరపున మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు.


