
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని కొణిదేల రోడ్డులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పగిడ్యాల మండలం నెహ్రునగర్ గ్రామానికి చెందిన పాలమర్రి నారాయణ (47) కూలీ పనులు చేసుకొని జీవిస్తుంటాడు. సోమవారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు మొక్కజొన్న దిగుబడిని నందికొట్కూరు పట్టణ సమీపంలో జీవనజ్యోతి స్కూల్ వద్ద ఉన్న మెట్టపై ఆరబోసేందుకు వచ్చాడు. పని ముగించుకొని సాయంత్రం చీకటి పడగానే బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరిన అతను కొణిదేల రోడ్డులో ఆగి ఉన్న బిజినవేముల గ్రామానికి చెందిన తిరుపతయ్య ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. చీకటిలో కనిపించకపోవడంతో జరిగిన ఈ ఘటనలో నారాయణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య రాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.