
రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం
ఆదోని సెంట్రల్/మంత్రాలయం: ఆదోని డివిజన్ పరిధిలోని మంత్రాలయం ఆర్‌ఎస్ దగ్గర కిలోమీటరు నంబర్. 535/23–25 మధ్య ఎ.బాలరాజు అనే వ్యక్తి ట్రైన్ నుంచి ప్రమాదావశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఆర్‌పీ ఎస్‌ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. మృతుడు తమిళనాడు రాష్ట్రం ముతుసమియపురం మండలం ముహపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. బతుకు దెరువు నిమిత్తం సోలాపూర్‌కు వెళ్లి ట్రైన్‌లో స్వగ్రామానికి తిరిగొస్తున్నాడు. సోలాపూర్ నుంచి మధురై వరకు రైల్వే టికెట్ ఉంది. ట్రైన్ నంబర్ 16351లో ప్రయాణం చేస్తుండగా మంత్రాలయం ఆర్‌ఎస్ దగ్గర ప్రమాదావశాత్తు రైలు నుంచి జారి కిందకు పడడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడిని 108 అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ బాలరాజు మృతి చెందాడు. మృతుడికి భార్య కామాక్షి, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిసింది.