● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ● కార్తీక పౌర్ణమిన వైభవోపేతంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి | - | Sakshi
Sakshi News home page

● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ● కార్తీక పౌర్ణమిన వైభవోపేతంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి

Oct 22 2025 7:18 AM | Updated on Oct 22 2025 7:18 AM

● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమ

● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమ

● శ్రీగిరిలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ● ప్రతి సోమవారం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ● కార్తీక పౌర్ణమిన వైభవోపేతంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి

కార్తీకం..శుభకరం!

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రం దీప కాంతులతో వెలుగొందనుంది. నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే సకల ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే మిగతా పర్వదినాల కంటే ఈ మాసంలో శివుడిని ఆరాధించేందుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీగిరికి తరలివస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని దీపారాధన చేసుకుంటారు. ఈ మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కృష్ణానది వద్ద పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం విశేషంగా జరుపుతారు. ముందుజాగ్రత్తగా శ్రీగిరికి తరలివచ్చే భక్తుల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. కార్తీకమాసంలో ప్రతి సోమవారం(నాలుగు సోమవారాల్లో) లక్షదీపోత్సవం, పుష్కరిణికి హారతి నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలోని పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి నవవిధ హారతలు ఇస్తారు. అనంతరం లక్షదీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ దీపోత్సవంలో భక్తులందరూ కూడా దీపాలను వెలగించుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. సుష్కరిణికి శాస్త్రోక్తంగా దశహారతులు సమర్పిస్తారు. హారతి కార్యక్రమంలో ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహాహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతులు ఇస్తారు. అలాగే ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో విశేషంగా పూజాదికాలు నిర్వహించి చివరగా స్వామి అమ్మవార్లకు దశహారతులతో నీరాజనాలు సమర్పిస్తారు.

జ్వాలాతోరణం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్తంభాలపై నెయ్యితో వత్తులను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఇది తోరణంగా వెలుగుతుంది. తోరణంలో కాలిన నూలు వత్తుల నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు నుదుట ధరించడం ఎంతో విశేషంగా భావిస్తారు.

వనభోజనాలు:

కార్తీకమాసంలో ముఖ్యమైన అంశం వనభోజనాలు. ఈ వనభోజనాలను పలు వృక్షజాతులున్న వనంలో ఉసిరిక చెట్టు కిందనే చేయాలని శాస్త్రం చెబుతుంది. వనంలోనే వంటలను వండుకొని తినాలి. ఈ వంటల్లో ఉసిరిక కాయలను విధిగా వినియోగించాలి. వనభోజనాలు చేయడం వలన అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

ఉపవాసం

ఆధ్యాత్మిక సాధనకు అనువైన కార్తీకమాసంలో ఉపవాసం ప్రధానమైనది. ఈ నెలలో పగలు ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేయడం మంచిది. పగలంతా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు, అల్పాహరం వంటివి తీసుకోవచ్చు. ఈ నెలంతా ఉపవాసం ఉండకపోయినా కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి వంటి పర్వదినాల్లోనైనా ఉపవాసం ఉండటం శ్రేయస్కరం.

పుణ్యనదీ హారతి

కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని పాతాళగంగ వద్ద కృష్ణవేణమ్మ తల్లికి సాయంత్రం 5 గంటలకు పుణ్యనదీహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. కృష్ణవేణి నదీమాతల్లికి విశేషపూజలు నిర్వహించి వాయనంగా సారె సమర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement