
సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయం
● 24న నంద్యాలలో భారీ సభ
● సాగునీటి సాధన సమితి రాష్ట్ర
అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల(అర్బన్): సీమ సాగునీటి హక్కుల పరిరక్షణే రాయలసీమ సాగునీటి సాధన సమితి ధ్యేయ మని ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. రాయలసీమ నీటి హక్కులను రక్షించడం, సీమకు న్యాయం జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 24న పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో భారీ సభ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో కలిసి సభ పాంప్లేట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సీమ రైతులు 60 వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ ప్రాజెక్టు రూపకల్పనలో సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్సార్బీసీ, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సుమారు 3 లక్షల ఎకరాలను భూ సేకరణ ద్వారా రైతులు త్యాగం చేశారని, వాటి ద్వారా సీమలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాల్వల ద్వారా నీరు అందుతుందన్నారు. మరో 2 లక్షల ఎకరాలకు రైతులు ఇంజిన్ల సాయంతో నీరు తోడుకోవాల్సి వస్తుందన్నారు. మిగిలిన 10 లక్షల ఎకరాల రైతులు నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్న 5 నుంచి 10 శాతం పనులు పూర్తి చేస్తే మొత్తం ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. కుందూనది విస్తరణ పేరుతో కొత్త భూసేకరణలు చేయడం అన్యాయమన్నారు. 24న నిర్వహించే సభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నాయకులు వడ్డె మహదేవ్, చైర్మన్ వడ్డె శోభానాద్రీశ్వరరావుతో పాటు కోస్తాంద్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.