
సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ కరువు
కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టడంతో డిమాండ్ తగ్గింది. ఈ నెల 10 నుంచి విత్తన పంపిణీ మొదలైంది. అప్పటికే ఆలస్యం కావడంతో రైతులు ప్రత్యామ్నాయంగా విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్థ(ఏపీసీడ్స్) విత్తన సరఫరా చేస్తోంది. రబీ సీజన్‌కు 36,461 క్వింటాళ్లు కేటాయించగా.. ఏపీసీడ్స్‌లో విత్తనోత్పత్తి చేయించిన 10వేల క్వింటాళ్లు మాత్రమే ఉంది. దీనినే ఏపీ సీడ్స్ అధికారులు ప్రాసెసింగ్ చేసి రైతు సేవా కేంద్రాలకు తరలించారు. స్థానికంగా ప్రయివేటు విత్తన కంపెనీలు కూడా శనగ విత్తనాలు ఉత్పత్తి చేయించి సేకరించి పెట్టుకున్నాయి. అయితే గత బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీసీడ్స్‌కు సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో విత్తన కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీసీడ్స్ అధికారులు గుంటూరు, ప్రకారం జిల్లాల నుంచి శనగ విత్తనాలు తెప్పించి రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
రైతు మృతి
అవుకు(కొలిమిగుండ్ల): పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఇస్రానాయక్ తండాకు చెందిన రైతు మీటునాయక్(55) అవుకులో పంటల కోసం ఎరువులు కొనుగోలు చేసి ఆటోలో వేసుకుని స్వగ్రామానికి బయలు దేరాడు. మార్గమధ్యలో వర్షం రావడంతో ఆటోను పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఎరువులు తడవకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు యత్నిస్తుండగా అదే సమయంలో బనగానపల్లె నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో మీటు నాయక్ రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో 108 వాహన సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
స్కూల్ బస్సు కింద పడి చిన్నారికి తీవ్ర గాయాలు
ఆళ్లగడ్డ: మండలంలోని కొండంపల్లె గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆళ్లగడ్డ పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి ప్రైవేటు పాఠశాల బస్సును ప్రధానమంత్రి సమావేశానికి ప్రజలను తరలించేందుకు అధికారులు కేటాయించారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం ప్రజలను తీసుకెళ్లేందుకుని వేగంగా వెళ్తూ కొండంపల్లె గ్రామంలో రోడ్డు సైడు ఆడుకుంటున్న జీనిత్‌ను ఢీకొంది. ప్రమాదంలో చిన్నారి కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు వెంటనే నంద్యాల వైద్యశాలకు తరలించారు. మూడేళ్ల క్రితం జీనిత్ తండ్రి దస్తగిరి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి దస్తగిరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.
మరో నలుగురికి డెంగీ
వెల్దుర్తి: మండలంలో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. రెండ్రోజుల క్రితం 10 మందికి డెంగీ నిర్ధారణ కాగా తాజాగా బుధవారం మరో నలుగురికి డెంగీ సోకింది. పట్టణానికి చెందిన హోంగార్డు షాకీర్ బాషా స్థానిక స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుమారుడు రెండ్రోజుల క్రితం డెంగీ లక్షణాలతో సీహెచ్‌సీలో చికిత్స పొందుతుండగా, తాజాగా హోంగార్డుకు సైతం డెంగీ లక్షణాలు తేలడంతో చికిత్స పొందుతున్నాడు. మదార్‌పురం మహేంద్ర, మరో ఇద్దరు సైతం అదే ఆసుపత్రిలో డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని 14, 15వ వార్డులలో డెంగీ జ్వర కేసులు పెరిగిపోతుండడం గమనార్హం.