
గిట్టుబాటు ధర లేదు, పైసా నిధులివ్వరు!
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన ఉల్లి, టమాటాలకు గిట్టుబాటు ధర కల్పించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని.. పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు పైసా నిధులు ఇవ్వని మోదీకి కర్నూలులో పర్యటించే అర్హత ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను నిరసిస్తూ కర్నూలులో మోదీ గోబ్యాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అంతటా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు నల్లదస్తులు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలో వి.శ్రీనివాసరావు, పి.రామచంద్రయ్య మాట్లాడుతూ ఏపీకి విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌కు ఆ పదవులు ఎందుకని ప్రశ్నించారు. ఏపీ ఎంపీలతో ప్రధానమంత్రిగా ఉన్న మోదీకి.. ఏపీకి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వరని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ప్రశ్నించడంలేదన్నారు. మరోవైపు నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గకున్నా సంబరాలు ఎందుకన్నారు. కేవలం బీమా కంపెనీలకు మేలు చేసేలా మాత్రమే జీఎస్టీ సంస్కరణలు జరిగాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బి.గిడ్డయ్య, డి.గౌస్‌దేశాయ్, నాయకులు పి.నిర్మల, మునెప్ప, లెనిన్‌బా బు, పీఎస్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.