
కప్పట్రాళ్ల గ్రామంలో విదేశీయుల పర్యటన
దేవనకొండ: మండల పరిధిలోని ఐజీ ఆకె రవికృష్ణ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో బుధవారం ఆఫ్రికా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది ఎన్‌ఐఆర్‌డీ యంగ్ ప్రొఫెషనల్స్ పర్యటించారు. మూడు రోజులుగా గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొదుపు మహిళా సంఘాలు, రైతులు, విద్యార్థులతో చర్చించి ఐజీ ఆకె రవికృష్ణ చేసిన గ్రామాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆఫ్రికా దేశ ప్రతినిధి షైనీలూమ్ మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మార్పు కనిపిస్తోందన్నారు. పొదుపు సంఘాల మహిళలు స్వశక్తితో ఎదుగుతున్నారన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని, విద్యార్థులు చదువులో ప్రగతి సాధిస్తున్నారన్నారు. గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కప్పట్రాళ్ల మార్పు దేశానికే ఆదర్శమన్నారు. గ్రామంలో సీ్త్ర శక్తి భవన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కళ్యాణ మండపం, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఐజీ ఆకె రవికృష్ణ వర్చువల్‌గా యంగ్ ప్రొఫెషనల్స్‌తో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో క్షితిష్ రాజ్ (బిహార్), హర్పిక్ కన్నా(మధ్యప్రదేశ్), తుషార్ కౌశిక్(ఉత్తరప్రదేశ్), సౌరబ్‌పాటిల్ (మహారాష్ట్ర), సంపత్‌కుమార్(తెలంగాణ), సుమన్‌చౌహాన్(తెలంగాణ), సతీష్‌కుమార్(ఆంధ్రప్రదేశ్), గ్రామ జ్యోతి మేనేజర్ బి.నారాయణ, సిబ్బంది సుధాకర్, సరిత, రాజేశ్వరి, ఫర్జానా పాల్గొన్నారు.