
ఒంటరి మహిళ మృతి
ఆత్మకూరురూరల్: మూడేళ్ల క్రితం కుట్టు మిషన్‌తో వచ్చి నల్లకాల్వగ్రామంలోని ఎస్సీ కాలనీలో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళ రాజమ్మ(65) మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో శిథిలావస్తులో ఉన్న ఓ గృహంలో ఉంటూ పాత చీరలతో బొంతలు కుడుతూ జీవనం సాగించేది. ఎప్పుడు కూడా తనది ఏ గ్రామమో, తన వారు ఉన్నారో లేదో ఎవరికీ చెప్పని రాజమ్మ రెండు రోజుల నుంచి నుంచి బయటికి రాలేదు. బుధవారం గుడిసె నుంచి దుర్గంధం వ్యాపించడంతో స్థానికులు వెళ్లి చూడగా మృతిచెంది ఉండటంతో సచివాలయ మహిళా కానిస్టేబుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆత్మకూరు పోలీసులకు సమాచారం చేరవేయగా స్టేషన్‌లో సిబ్బంది మొత్తం ప్రధాని బందోబస్తు నిమిత్తం శ్రీశైలం వెళ్లారని సమాధానం వచ్చింది. సర్పంచ్, గ్రామ రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు సైతం అందుబాటులో లేక పోవడంతో గ్రామస్తులు ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్నారు. తామే అంతిమ సంస్కారం చేస్తే పోలీసుల నుంచి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందని భయపడి మిన్నకుండిపోయారు. గురువారం వరకు వేచి ఉండి అధికారుల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోతే.. అప్పుడు తామే అంత్యక్రియలు చేద్దామని గ్రామస్తులు మాట్లాడుకున్నట్లు సమాచారం.