
ఘాట్‌రోడ్డు విస్తరించేనా:
శ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకై న ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్‌హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్‌పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.