
షికారీ గ్యాంగ్ అరెస్ట్
ఆలూరు రూరల్: హైవేల్లో నిలిచిన లారీలను రాబరీ చేస్తున్న షికారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 5న ఆలూరు సమీపంలోని కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారిలో లారీ నిలిపి డ్రైవర్ నిద్రిస్తుండగా షికారీ గ్యాంగ్‌కు చెందిన షికారీ పరమేష్, మూర్తి సెల్‌ఫోన్, నగదు చోరీకి యత్నించగా డ్రైవర్ ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేసి పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో అప్పట్లో కేసు నమోదు చేశారు. పోలీసు బృందాల ద్వారా సాంకేతికత ఉపయోగించి గాలించి బుధవారం అర్ధరాత్రి ఆలూరు సమీపంలోని ఆంజనేయ విగ్రహం వద్ద అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం చిక్కవాడి గ్రామానికి చెందిన పరమేష్, బళ్లారి జిల్లా బసరకోడుకు చెందిన మూర్తి జల్సాలకు అలవాటు పడి హైవేల్లో ఆపిన లారీలను రాబరీ చేసేవారన్నారు. వీరు గతంలో కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని మర్డర్ కేసులో, ఆదోని మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు చోరీ కేసుల్లో కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారన్నారు. ఎస్‌ఐ మహబూబ్ బాషా, ఏఎస్‌ఐ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రంగయ్య, కానిస్టేబుళ్లు కేశవ రెడ్డి, పరశురాం, సుధాకర్, హోంగార్డులు వీరాంజి, రమేష్ ఉన్నారు.