
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కర్నూలు(అర్బన్): మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఏ క్యాంప్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన పోషణ్ మాహ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం మెరుగుపడాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ మాట్లాడుతూ పోషకాహార వినియోగంపై మహిళలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ఏడాది చేపట్టే పోషన్ మాహ్ కార్యక్రమాలు అక్టోబర్ 16వ తేది వరకు కొనసాగుతాయన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య గర్భిణిలకు శ్రీమంతం, చిన్న పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ కర్నూలు ప్రాజెక్టు సీడీపీఓ అనురాధమ్మ, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రాజేశ్వరి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కె.బాలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.