
‘19న చలో ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాల’
● వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు
కర్నూలు (టౌన్): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఈనెల 19న చలో ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాల పేరుతో శాంతి యుతంగా ఆదోని పట్టణంలో ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరిస్తే సామాన్య ప్రజలకు వైద్యం దూరం అవుతుందన్నారు.
మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు
రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కష్టమవుతుందని, వైద్య సీట్లు వద్దంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం సిగ్గు చేటని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, అధికార ప్రతినిధి కటికె గౌతమ్‌లు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రెవేటీకరిస్తున్నారని విమర్శించారు. ఏటా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈనెల 19 న జరిగే చలో ఆదోని కార్యక్రమానికి జిల్లాలోని ఏడు నియోజవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు, ప్రజలుల పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో యువజన విభాగం నాయకులు దుర్గా ప్రసాద్ (పాణ్యం), వెంకటేష్ (కోడుమూరు), నజీర్ (ఎమ్మిగనూరు) అశోక్ రెడ్డి (పత్తికొండ), మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.