
పశు సంపదను కాపాడుకోవాలి
● పశుసంవర్ధక శాఖ జిల్లా ఉప సంచాలకులు శ్రీనివాసరావు
పగిడ్యాల: వ్యాధుల బారిన పడకుండా పశు సంపదను కాపాడుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా ఉప సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని పాత ముచ్చుమర్రి పశువైద్యశాల, నెహ్రూనగర్ గ్రామీణ పశువైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ అభివృద్ధి చెందాలని, దీనిపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. మేలు జాతి పాడి గేదెలు, ఆవుల ద్వారా అధిక లాభాలు ఉన్నాయన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద ప్రస్తుతం పశువులకు గాలి కుంటు సోకకుండా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా గాలికుంటురోగంతో పశువులు మృతి చెందే ప్రమాదం ఉందన్నారు. ఈయన వెంట జూపాడుబంగ్లా డివిజన్ సహాయ సంచాలకులు రామాంజి నాయక్, డాక్టర్ రాగసంధ్య, వీఎల్‌ఓ శ్రీనివాసులు, ఏహెచ్‌ఏ చరిత, ఓఎస్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
బైక్ జాతాను విజయవంతం చేయండి
డోన్ టౌన్: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ జాతాను విజయవంతం చేయాలని ఆ నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. ఈనెల 19వ తేది బైక్ జాతా డోన్‌కు చేరుకుంటుందన్నారు. బుధవారం డోన్‌లోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యహరిస్తే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాబు, కేశవరెడ్డి, రామమూర్తి, గోపాల్, అబ్దుల్ లతీఫ్, రమేష్ నాయుడు,అంజనప్ప, చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, మధు, కృష్ణనాయక్, కుళ్లాయప్ప, సంజీవరాయుడు, బాలరంగారెడ్డి, రవిచంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, మ్యాథ్స్ బోధించేందుకు ఆసక్తి గల వారు ఈ నెల 19వ తేదీ ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరై డెమో క్లాసు ఇవ్వాలన్నారు.నియామకాల్లో ఏపీ సెట్, నెట్, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

పశు సంపదను కాపాడుకోవాలి