
ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే!
● లేని పక్షంలో ఈనెల 21 నుంచి కళాశాలల మూసివేస్తాం ● ఆర్‌యూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు
కర్నూలు కల్చరల్: డిగ్రీ కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఈనెల 21 నుంచి కళాశాలల మూసివేస్తామని రాయలసీమ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. బుధవారం ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావుకు వినతి పత్రం అందజేశారు. రెండేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని సుమారు 86 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సంబంధించి రూ. 350 కోట్ల బకాయి ఉందని ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని వాపోయారు. 2023 నుంచి 2025 ఏడాది వరకు పెండింగ్ ఆర్టీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని, డిగ్రీ ఫీజులను సవరించి, కొత్త ఫీజుల విధానాన్ని వర్సిటీలకు అప్పగించాలని, డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో నెలకొన్న అక్రమాలు, గందరగోళాన్ని తొలగించాలని, కళాశాలలకు అఫ్లియేషన్‌ను వార్షికంగా కాకుండా 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాలని, ప్రతి ఏడాది అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్‌ఎస్ శౌరిల్‌రెడ్డి, గౌరవాఽధ్యక్షుడు వేణుగోపాలాచారి, కోశాధికారి కె.రమణారెడ్డి, ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి గుర్రాల వెంకట రెడ్డి, జాయింట్ సెక్రటరీ రమేష్, స్టేట్ రీజినల్ కోఆర్డినేటర్ వెంకట మాధవ్, తదితరులు వీసీ వెంకట బసవరావు, రిజిస్ట్రార్ విజయ్‌కుమార్ నాయుడులకు వినతి పత్రం అందజేసినవారిలో ఉన్నారు.