
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
నంద్యాల అర్బన్: మండల పరిధిలోని అంబాడం తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాలకు చెందిన ఈ విద్యార్థులు బుధవారం రాత్రి మహానంది వైపు నుంచి బైక్‌పై వస్తుండగా గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో కె. మహావీర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా సూర్యప్రకాష్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురు పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థలో పదోతరగతి చదువుతున్నట్లు సమాచారం.విషయం తెలుసుకున్న నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ–క్రాప్ నమోదు వేగవంతం చేయాలి
దొర్నిపాడు:ఈ–క్రాప్ నమోదును వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి సూచించారు. బుధవారం స్థానిక రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ–క్రాప్ నమోదు ఎంత వరకు వచ్చిందని ఆరాతీశారు. పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. రైతులు వ్యవసాయాధికారులకు సహకరించి నమోదు చేసుకోవాలని సూచించారు. మండలంలో సాగుచేసిన పంటలు, వాటి పరిస్థితిపై ఆరా తీశారు. వర్షాలకు ఏమైనా పంటలు దెబ్బతిన్నట్లయితే పంటలు మాములు స్థితిలోకి వచ్చేలా చర్యలు తీసుకొని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్, మండల వ్యవసాయాధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.