
బెంగాలీ నాట్లు.. తప్పిన కూలీ పాట్లు!
● వరి నాట్లకు బెంగాలీ కూలీలు
● ఖర్చు తగ్గుతుండటంతో
ఆసక్తి చూపుతున్న రైతులు
● తీరిన కూలీల కొరత
గోస్పాడు: జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతోంది. ఈ క్రమంలో ఏటా నాట్ల సమయంలో కూలీల కొరత తీవ్రంగా రైతులను వేధిస్తుండేది. ఈ సమస్య పరిష్కారమయ్యేలా బెంగాలీ కూలీలు జిల్లాకు చేరుకున్నారు. నాట్లు వేయడంలో వీరికి ప్రత్యేకత ఉండటంతో రైతులు బెంగాళీ నాట్లు వేస్తున్నారు. స్థానిక కూలీల విధానంలో నాట్లు వేస్తే పెట్టుబడి ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. అలాగే ఎకరానికి 25 కిలోల విత్తనాలు నారు కోసం వినియోగిస్తారు. కాగా బెంగాలీ కూలీలు లేత నారుతో వేగంగా వేస్తారు. ఎకరాకు 15 కిలోలు విత్తనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. వీరు వేసిన నాట్లు నాలుగైదు రోజుల్లో పైరు తిరుగుతుండగా స్థానిక కూలీలు వేసిన నాట్లు పైరు తిరగాలంటే పది రోజులు పడుతుంది. నాట్లకు స్థానిక కూలీలు ఆరుగురు అవసరమైతే బెంగాలీలు నలుగురు సరిపోతారు. వీరు వేసే నాటులో వాడే నారుతో పోల్చితే స్థానికులు నారును అధికంగా వినియోగిస్తారు. స్థానిక కూలీలతో పోలిస్తే బెంగాలీ నాట్లు వల్ల రైతులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. ఈ విధానంతో రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం బెంగాలీ నాట్లు వేసినట్లు తెలుస్తోంది.
పొలం వద్దే వంటావార్పు..
బెంగాలీలు పొలాల వద్దే వంటావార్పు చేసుకుని పనులు చేస్తున్నారు. గ్యాస్‌పొయ్యి, వంటపాత్రలు వెంట పట్టుకొని పొలాల వద్ద వాలిపోతారు. సమయానికి అక్కడే పొలం గట్లపై భోజనాలు చేయడంతో సరిపెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. స్థానికులతో పోల్చితే వారు నాట్లు వేసే విధానం వేగంగా తక్కువ సమయంలో పూర్తవుతుండటంతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఉదయం నుంచే చీకటి పడేవరకు పొలాల్లోనే ఉంటు పనులు చేస్తున్నారు.