
స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి
● ఎంపీడీఓల శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులపై స్థానిక సంస్థలు ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను పెంచుకుంటే స్వయం ప్రతిపత్తి సాధించేందుకు అవకాశాలు ఏర్పడతాయని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు ‘ సొంత ఆదాయ వనరులు ’ అనే అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీఎస్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాలకు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్, ప్రకాశం జిల్లాకు డ్వామా విజిలెన్స్ అఫీసర్‌గా పదోన్నతిపై వెళ్తున్న గూడూరు ఎంపీడీఓ అశ్వినీకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకుంటే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల చెల్లింపు, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇబ్బంది ఉండదన్నారు. జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ రాయలసీమలోని వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయాలను గ్రామాల్లో మెరుగుపరచి నీటి పన్ను వసూళ్లకు కృషి చేయాలన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలు చేపట్టి ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. డీపీఓ మాట్లాడుతూ ప్రజలు పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ గంగాధర్, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి. జేమ్స్ కృపావరం, ఆస్రఫ్‌బాష, పి. జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.