
సీమ రైతుకు తీవ్ర అన్యాయం
కృష్ణా జలాలను నెల్లూరు వైపు తరలించే కుట్ర
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
పాములపాడు: శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంలో రాయలసీమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు సాక్షిగా రాయలసీమ నీటి హక్కులపై ప్రభుత్వ దాడిని క్షేత్ర స్థాయిలో తెలుసుకునే కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉన్న రోజుల్లో రోజుకు 4 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకునే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచారన్నారు. అనధికారికంగా ఎస్‌ఆర్‌బీసీ కాలువకు అడ్డుకట్ట వేశారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సాధారణంగా వరద నీటి ప్రవాహం 30 రోజులకు మించి ఉండదన్నారు. పెంచిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ల సామర్థ్యతో 30 రోజుల్లో సీమలోని రిజర్వాయర్లు నింపాల్సి ఉందన్నారు. అయితే, నెలరోజుల్లో 40 టీఎంసీల నీటి తరలింపు జరగడం లేదన్నారు. ఫలితంగా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
కృష్ణా జలాలను నెల్లూరుకు తరలించే కుట్ర
రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని 30 రోజుల్లో జలశయాలకు తరలించేందుకు అవసరమైన పనులు చేపట్టాల్సిన పాలకులు, రెగ్యులేటర్ల నీటి ప్రవాహాన్ని మార్చి కృష్ణాజలాలను నెల్లూరు వైపు తరలించే కుట్ర చేస్తున్నారని బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే రాయలసీమలో మరింత బలవంతపు భూ సేకరణ, కుందూ, గాలేరు తదితర నదులను కాలువగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.