
ఉపాధ్యాయ ఉద్యోగం ఎందుకు ఇవ్వరు?
కర్నూలు సిటీ: ‘డీఎస్సీలో ర్యాంకులు తెచ్చుకున్నాం.. కాల్ లెటర్లు పంపించారు.. మూడు విడతల్లో సర్టిఫికెట్లు పరిశీలన చేశారు.. అయినా ఫైనల్ సెలెక్షన్ లిస్టులో మా పేరు లేదు.. ఉపాధ్యాయ ఉద్యోగం ఎందుకు ఇవ్వరు’ అని విద్యాశాఖ అధికారులను డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నించారు. వందలాది మంది మంగళవారం కర్నూలు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. ‘ఒక్కో పోస్టుకు ఒకరినే ఎంపిక చేసి సర్టిఫికెట్లు పరిశీలించామని చెప్పి ఇంత మోసం చేస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఆవేదన విన్న తరువాత డీఈఓ ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఐదారుగురు హెచ్‌ఎంలను అక్కడ ఉంచి అభ్యర్థుల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులను పరిశీలించిన డీఈఓ శామ్యూల్ పాల్.. ఏఏ అభ్యర్థి ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో వివరించారు. మరికొంత మందికి హెచ్‌ఎంలు వివరించారు. డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి నిర్లక్ష్యంతో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాన్ని కోల్పోయానని ఓ నిరుద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌ను అందజేసినా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేదన్నారు. ఈ విషయంపై బాధితుడు సదరు ఉద్యోగిని అడిగితే తనకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని అంటున్నట్లు తెలుస్తోంది.
108 వాహనంలోనే ప్రసవం
డోన్ టౌన్: కాన్పు కోసం వెళ్తున్న ఇద్దరు నిండు గర్భిణులు 108 వాహనంలోనే మంగళవారం ప్రసవమయ్యారు. డోన్ మండలం బోంతిరాళ్ల గ్రామానికి చెందిన త్రివేణి పురిటి నొప్పులతో 108లో కర్నూలుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో టోల్‌గేట్ వద్ద ప్రసవం అయ్యారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లిని, బిడ్డను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెల్దుర్తి నుంచి మరో నిండుగర్భిణిని ప్రసవం కోసం 108 వాహనంలో తీసుకెళ్తుండగా ఆమె కూడా మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒకేరోజు ఒకే 108లో రెండు ప్రసవాలు అయ్యి తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.