
మెడికల్ కాలేజీలను నిర్వహించలేరా?
అలాంటప్పుడు సీఎం పదవి ఎందుకు?
రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు
పాలన అంటే ఇదేనా?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
ఆదోని మెడికల్ కాలేజీని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్
ఆదోని టౌన్: మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వ ర్యంలో నిర్వహించలేని వారికి సీఎం పదవి ఎందుకు అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిందన్నారు. ఈ కళాశాలలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు. మెడికల్ కళాశాలలను నడపలేని వారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఆదోని మండలం ఆరేకల్ గ్రామ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కళాశాలను ఎస్వీ మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం అనుమతులతో 17 కళాశాలలను మంజూరు చేయించారన్నారు. అందులో ఐదు మెడికల్ కళాశాలలు నిర్మాణాలు కూడా పూర్తి చేసి ఒకేసారి ప్రారంభించారన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు కూడా కేటాయించారని గుర్తు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే పులివెందుల మెడికల్ కళాశాలకు మంజూరు చేసిన 50 సీట్లను రద్దు చేశారని ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. మెడికల్ కళాశాలలను (పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం) పీపీపీ విధానంలో కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరా లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నా.. మెడి కల్ కళాశాలలను నడిపే సత్తా లేదా అని ప్రశ్నించారు.
అభివృద్ధి ఏదీ?
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీలను విస్మరించారన్నారు. ఆదోని ప్రాంతంలో మెడికల్ కళాశాల పూర్తయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు.
అంతా అమరావతి జపమే!
పూర్తి చేసిన మెడికల్ కళాశాలలను ప్రారంభించలేని వారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అమరావతి జపమే వినిపిస్తోందన్నారు. కూటమి నాయకులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడంలేదన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు శశికళ, వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నేత జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లోకేశ్వరి, పట్టణాధ్యక్షుడు దేవా, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగరాజు, వీరస్వామి, బైచిగేరి గ్రామ సర్పంచ్ మహాదేవ, ఎస్సీ సెల్ పట్టణ నియోజకవర్గ అధ్యక్షుడు వై.పి.గంగాధర్, ఏసోబు, కార్యకర్తలు పాల్గొన్నారు.