
ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం
కృష్ణగిరి: ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. కోయిలకొండ గ్రామానికి చెందిన కొందరు కూలీలు ట్రాక్టర్‌లో దేవనకొండ మండలం పీ. కోటకొండ వద్ద వేరుశనగ నూర్పిడి మిషన్ పనులకు సోమవారం ఉదయం బయలుదేరారు. మార్గమధ్యంలో కంబాలపాడు గ్రామం దాటిన వెంటనే రామలక్ష్మమ్మ బావి సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి గుంతలో బోల్తా పడింది. దీంతో ట్రాలీలో ఉన్న వారంతా ట్రాలీ కింద చిక్కుకపోయారు. ట్రాలీలో వెనుక భాగంలో కొంత గ్యాప్ ఉండటంతో దాని ద్వారా అంతటా బయటపడ్డారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన మండ్ల సరస్వతి(45) మృతి చెందారు. మరో వ్యక్తి రవికి గాయాలయ్యాయి. రహదారి వెంట వెళ్లే వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. సరస్వతికి భర్త మండ్ల బాలమద్ది, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం