
మొరాయిస్తున్న పోతిరెడ్డిపాడు గేటు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ 4వ గేటు రెండు రోజులుగా మొరాయిస్తోంది. హెడ్‌రెగ్యులేటర్‌కు పదిగేట్లు ఉండగా అందులో 1వ గేటు రోప్ తెగిపోవటంతో దానికి మరమ్మతులు నిర్వహించకుండా దాన్ని ఆపరేట్ చేయటం లేదు. మిగిలిన తొమ్మిదిగేట్లల్లో ప్రస్తుతం 2, 4, 5, 6, 7 గేట్లను మాత్రమే ఆపరేట్‌చేస్తూ ఎస్సారెమ్సీకి నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ఈ క్రమంలో 2, 5, 6, 7 గేట్లను కిందికి దించగా అవి కిందికి దిగాయి. 4వ గేటును కిందికి దించేందుకు యత్నించగా కిందికి దిగకుండా రెండు అడుగుల ఎత్తులో మొరాయించింది. దాన్ని కిందికి దింపేందుకు పోతిరెడ్డిపాడు పర్యవేక్షణాధికారులు ఎన్‌సీఎల్ సిబ్బంది సహకారంతో రెండు రోజుల నుంచి గేటుకు జాకీలను అమర్చి వెల్డింగ్ చేయటం ద్వారా కిందికి దించేందుకు యత్నిస్తున్నా ఫలించలేదు. ఈ విషయమై పోతిరెడ్డిపాడు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డిని వివరణ అడగ్గా గేటు కిందికి దిగకపోయినా ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. ప్రస్తుతం 4వ గేటు ద్వారానే 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిసరఫరా పెంచాలన్నప్పుడు గేటును పైకి ఎత్తి నీటి విడుదలను పెంచటం జరుగుతుందని తెలిపారు.