
కూటమి ప్రభుత్వంలో విగ్రహాలకు రక్షణ కరువు
● కనకదాసు విగ్రహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్‌సీపీ నేతలు
ఆలూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో విగ్రహాలకు రక్షణ కరువైందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, మాదాసి, మాదారి కురువ వైస్సార్‌సీపీ విభాగం రాష్ట్ర అఽధ్యక్షుడు గడ్డం రామకృష్ణ అన్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆ సంఘం నాయకులతో కలిసి సోమవారం విగ్రహాన్ని పరిశీలించి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు కొందరు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప విగ్రహాన్ని ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సంఘటన జరిగిన రోజే పత్తికొండ డీఎస్పీతో మాట్లాడి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పానన్నారు. ధ్వంసమైన విగ్రహాన్ని ఇదే స్థలంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విగ్రహాన్ని పగలకొట్టడం దారుణమన్నారు. అంతకు ముందు విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే విరూపాక్షి రూ. 20 వేలు, తెర్నేకల్ సురేందర్ రెడ్డి రూ.10 వేలు, వైఎస్సార్‌సీపీ కురువ సంఘం ధ్యక్షుడు గడ్డం రామకృష్ణ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ సర్పంచ్ కొల్లమ్మ, వైఎస్సార్‌సీపీ విభాగాల జిల్లా నాయకులు ఈరన్న, గిరి, శ్రీనివాసులు, వైస్‌ఎంపీపీ శ్రీరాములు, మల్లికార్జున రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లికార్జున, కో–కన్వీనర్ వీరేష్, నాయకులు వీరభద్రా రెడ్డి, శ్రీధర్ రెడ్డి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.