
టీడీపీ నేతల అ‘ధన’పు వసూళ్లు
● ప్రతి నెలా ఇన్‌చార్జి డీలర్‌షిప్‌లలో
మార్పులు
● ఒక్కో ఇన్‌చార్జి డీలర్‌షిప్‌నకు
రూ.50 వేల వరకు వసూలు
కర్నూలు(సెంట్రల్): పౌర సరఫరాల శాఖలో టీడీపీ నాయకుల అ‘ధన’పు వసూళ్లు ఎక్కువయ్యాయి. ప్రతి నెలా ఖాళీగా ఉన్న డిలర్‌షిప్‌ల స్థానంలో ఇన్‌చార్జ్‌ల కోసం సిఫార్సులు చేస్తుండడంతో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. జిల్లాలో 201 డీలర్‌షిప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఇన్‌చార్జ్‌లను టీడీపీ నేతలు రెండు, మూడునెలలకు ఒక్కసారి మారుస్తున్నారు. జిల్లాలోని కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్‌లో 80, పత్తికొండ డివిజన్‌లో 45 డీలర్ పోస్టులలు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఖాళీ పోస్టుల్లో ఇన్‌చార్జిలను నియమించుకొని పచ్చనేతలు పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్కో ఇన్‌చార్జి కోసం రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. కర్నూలు నగరంలో అయితే ఆ వసూలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి టీడీపీ చోటామోటా నేతలు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లా నేరుగా ప్రజాప్రతినిధులే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు, ఆదోనిలో భలే డిమాండ్
ఇన్‌చార్జ్ డీలర్‌షిప్‌లకు కర్నూలు, ఆదోనిలలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అక్కడ నేరుగా వినియోగదారులకు కేజీకి రూ.10–12 ఇచ్చి తంబ్ వేయించుకొని దోపిడీ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులు చేసే వారు అధికంగా ఉంటుండడంతో వారు బియ్యం తీసుకోరు. డీలర్లే నేరుగా వినియోగదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి అమ్మకాలు చేసుకుంటూ ఉంటారు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా రేషన్ డీలర్ల ఇన్‌చార్జ్‌లకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
డీలర్‌షిప్‌ల ప్రక్రియను అర్ధాంతరంగా
నిలిపివేసిన ప్రభుత్వం
జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం 2024 డిసెంబర్ 23వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్‌లో 80,పత్తికొండ డివిజన్‌లో 45 డీలర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేశారు. 2024 డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు డీలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 1,648 దరఖాస్తులు రాగా అందులో కర్నూలు డివిజన్‌లో 874, ఆదోని డివిజన్‌లో 512, పత్తికొండడివిజన్‌లో 262మంది దరఖాస్తు చేసుకున్నారు. 2025 జనవరి 5వ తేదీన డివిజన్ కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహించారు. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేసి భర్తీ చేస్తారనున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా, డీలర్‌షిప్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎందుకు నిలిపివేశారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు.