
కొనసాగుతున్న విజిలెన్స్ దర్యాప్తు
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అధికారులు రికార్డుల పరిశీలన కొనసాగించారు. విజిలెన్స్ డీఎఫ్‌ఓ శివప్రసాద్ నేతృత్వంలో పరిశీలన జరిగింది. కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన చాంద్‌బాషా నాలుగు కోట్ల రూపాయల అటవీశాఖ నిధులు వేరే బ్యాంకు ఖాతాలకు మళ్లించారన్న విషయంపై ఇప్పటికే కేసు నమోదై నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా చాంద్‌బాషా ఉద్యోగం నిర్వహించిన కాలంలో జరిగిన లావాదేవిలన్నీ పరిశీలించాలన్న ఉన్నతాధికారుల నిర్ణయంతో ఈ పరిశీలన సాగుతోంది. చాంద్‌బాషా అవినీతి వ్యవహారంలో ఇతరుల ప్రమేయాన్ని కూడా గుర్తించడం తమ తనిఖీ ఉద్దేశమని విజిలెన్స్ డీఎఫ్‌ఓ శివప్రసాద్ తెలిపారు. అటవీశాఖ కేంద్ర కార్యాలయం నుంచి అటవీ దళాల ప్రధా నాధికారి ఈ పరిశీలనను స్వయంగా సమన్వ యం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిశీలనలో ఎన్‌ఎస్‌టీఆర్ సర్కిల్ కార్యాలయ అకౌంటెంట్ పద్మావతి, కర్నూలు,నంద్యాల అడ్మినిస్ట్రే ట్ అధికారులు చంద్రశేఖరరాజు, రవికుమార్, విజిలెన్స్ రేంజ్ అధికారి శంకరయ్య ఉన్నారు.
పోక్సో కేసు నమోదు
కోడుమూరు రూరల్: ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం కోడుమూరుకు చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే కాలనీకి చెందిన 30ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో ఆ ఇంట్లోకి ప్రవేశించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎస్‌ఐ ఎర్రిస్వామి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు, నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించండి
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం సూర్యఘర్ పథ కం కింద సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ (ప్రాజెక్ట్స్) డైరెక్టర్ అయూబ్‌ఖాన్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పీఎం సూర్యఘర్ పథకం ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చక్కటి అవకాశం కల్పిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటిపైనే సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం ఆకర్షణీయమైన రాయితీలు ఇస్తోందని, బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని సోలార్ వెండర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నెల చివరి నాటికి 100 యూనిట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 20 యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. 200 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న వారందరూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలా చూడాలన్నారు. అలాగే లో వోల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉమాపతి, ఈఈ ఓబులేసు, జిల్లా నోడల్ అధికారి కృష్ణారెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్న రాఘవులు, కర్నూలు అర్బన్ ఈఈ శేషాద్రి, ఈఈ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న విజిలెన్స్ దర్యాప్తు