
అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య వాగ్వాదం
● పొలాలకు ఉన్న కంచె తొలగించేందుకు ప్రయత్నించడంతో తోపులాట
కొత్తపల్లి: పొలాలకు ఉన్న కంచెను తొలగించే క్రమంలో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని గువ్వలకుంట్ల మజారా గ్రామమైన పాతచదరంపెంట నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 50 ఇళ్లదాకా గిరిజనులు నివాసాలు ఏర్పాటు చేసుకోని జీవనం సాగించేవారు. పదేళ్ల క్రితం అటవీ శాఖ అధికారులు వారికి పాలెంచెరువు సమీపంలో ఐటీడీఏ శాఖతో కలిసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే పాత చదరంపెంటలో ఆ గిరిజనులు సుమారు 150 ఎకరాల పొలాన్ని సాగుచేసేవారు. అటవీ శాఖ అధికారులు ఇంటి స్థలాలు ఇచ్చారుగానీ పొలాలు ఇవ్వలేదని గిరిజనులు వాపోతున్నారు. ఈ పొలాలకు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఐటీడీఏ సహకారంతో చుట్టూ కంచె వేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం కంచె ఉండడం వల్ల అడవి జంతువులకు ఇబ్బంది కలుగుతుందని ఫారెస్ట్ అధికారులు కంచె తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో గిరిజనులకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. తమ పొలాలకు కంచె వేసుకుంటే ఫారెస్ట్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గం అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ వారేమో కంచె వేసుకోమంటున్నారు, ఫారెస్ట్ అధికారులు మాత్రం తొలగించాలంటున్నారని వాపోయారు. దీంతో ఫారెస్టు అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.