
‘చెత్త’ నగరంగా కర్నూలు
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో పారిశుద్ధ్యం లోపించి చెత్త నగరంగా తయారైంది. ఇందుకు మునిసిపల్ అధికారులే కారణమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుతోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పట్టణాల్లోనూ ఇంటింటి చెత్తసేకరణ, పారిశుద్ధ్య పనులను సజావుగా సాగేలా చూడాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మునిసిపాలిటీల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలులో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 1,200 మంది శానిటరీ వర్కర్లు ఉన్నప్పటికీ నగరాన్ని శుభ్రంగా ఉంచలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. బీక్యాంపు నుంచి రాజ్‌విహార్ వరకు రోడ్లు శుభ్రంగా లేవని.. పలుమార్లు చెప్పినా మార్పు లేద న్నారు. ఆయా శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకో వాలని మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను ఆదేశించారు. ప్రజారోగ్య అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. రేపటి నుంచి పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలని, తానే స్వయంగా తనిఖీ చేస్తానన్నారు.
కలెక్టర్ ఏమన్నారంటే..
● కల్లూరు పరిధిలోని 16 వార్డులకు ప్రతిరోజూ నీరు ఇచ్చేందుకు కమిటీలు వేశాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం.
● నగర సుందరీకరణలో భాగంగా బీక్యాంపు నుంచి బస్టాండ్ వరకున్న డీవైడర్లకు ఆకర్షణీయంగా పెయింటింగ్ చేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
● ఎన్క్యాప్ ఫండ్ రూ.7 కోట్లతో పనులు చేపట్టాలని 8 నెలల కిందట ఆదేశాలు ఇచ్చాం, పనులు నత్తనడక సాగుతుండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
● టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి పత్రికల్లో ప్రతి రోజూ ప్రతికూల వార్తలు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగు నివేదికలు ఇవ్వాలని సిటీ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు.
● ఆదోని బసాపురం ట్యాంకుకు సంబంధించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదోని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు కమిషనర్లు కృష్ణ, గంగిరెడ్డి, రమేష్‌బాబు, కర్నూలు నగర పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు.