
ఉరుకుందలో దోపిడీల జాతర!
● రెండు టెంకాయలు రూ.100 చొప్పున విక్రయం ● గుండుకు రూ.100 వసూళ్లు ● రాత్రికి రాత్రే గమనిక ఫ్లెక్సీలు మాయం ● కాంట్రాక్టర్లకు ‘రాజకీయ’ అండ
మంత్రాలయం: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు వైభవోపేతంగా జరగుతుండగా.. కాంట్రాక్టర్ల మాత్రం ‘రాజకీయ’ అండతో దోపిడీ జాతరకు తెరతీశారు. ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ భక్తులు 20 లక్షల నారీకేళాలు కొడుతున్నట్లు అంచనా. అందులో కాంట్రాక్టర్ ద్వారా రూ. 15 లక్షలకు పైగా విక్రయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా ఇక్కడ టెండర్ దారుడు ఒక్క టెంకాయి రూ.20 మాత్రమే విక్రయించాలని నిబంధన. అయితే కాంట్రాక్టర్ ఒక్కో టెంకాయను రూ.40కు దుకాణాలకు వేస్తున్నాడు. దుకాణ దారులు ఇక్కడ రెండు ఊది బత్తీలు, విభూతి, రెండు పూలు, రెండు టెంకాయలు కలిపి రూ.100 చొప్పున భక్తులకు విక్రయిస్తున్నారు. విక్రయదారుల దోపిడీని పక్కన పెడితే కాంట్రాక్టర్ దోపిడీ చాలా ఎక్కువ. జోడు టెంకాయలపై ఆయన రూ.40 ఆదాయం పొందుతున్నాడు. టీడీపీ నేత అండదండలతో స్థానికుడు టెంకాయల విక్రయ వేలం కై వసం చేసుకున్నాడు. నిరుడు కూడా ఆయనే టెండర్ సొంతం చేసుకున్నాడు. క్వింటా కొబ్బరి రూ.13 వేలు ధర పలుకుతోంది. దాదాపు 20 లక్షల చిప్పలకు గానూ 180 టన్నులు బరువు వస్తోంది. ఈ లెక్కన టెంకాయ చిప్పల నుంచి రూ.2.34 కోట్లు వస్తోంది. అయితే ఇక్కడ ముత్తన్న అనే టెండర్ దారుడు మాత్రం కేవలం రూ.60.13 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు.
కల్యాణ కట్ట దోపిడీ రూ.9 కోట్లు
టెంకాయల దోపిడీ ఒక ఎత్తు ఉంటే. ఇక్కడ కల్యాణకట్ట దోపిడీ మరీను. ఇక్కడ భక్తుడు తలనీలాలు ఇవ్వడానికి తలకు రూ.40 టిక్కట్ చెల్లించాల్సి ఉంది. అందులో రూ.35 కాంట్రాక్టర్‌కు కేటాయిస్తారు. తలనీలాల్లో వచ్చిన వెంట్రుకలు ఆయనే విక్రయిస్తాడు. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది భక్తులు తలనీలాలు ఇస్తున్నట్లు అంచనా. టిక్కెట్ ధర చెల్లించడమే కాకుండా కల్యాణ కట్ట క్షురకులు గుండుకు రూ.100 వసూలు చేస్తున్నారు. దాదాపు రూ.9 కోట్లకు పైగా అక్రమార్జన సాగిపోతోంది. కల్యాణ కట్ట టెండర్ దారుడు కరోనా నష్టం పేరుతో కేవలం 10 శాతం అధికంతో ఇక్కడ రెండేళ్లుగా తన టెండర్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు.
రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు మాయం
భక్తుల అవగాహన నిమిత్తం ఆలయ ఈవో విజయరాజు క్షేత్రంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా టెంకాయ రూ.20కు మాత్రమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తమకు ఫిర్యాదు చేయాలని వీధుల్లో, టెంకాయ దుకాణాలతో ఫ్లెక్సీలు పాతించారు. అయితే రాత్రి రాత్రే ఫ్లెక్సీలు మాయమయ్యాయి. క్షేత్రంలోని ఫ్లెక్సీలన్నీ తొలగించి దోపిడీకి తెర తీశారు. భక్తులకు అసలు గుట్టు తెలియకుండా మాయాజాలం చేశారు.
ఆలయ ఆవరణలో దుకాణాలు
రూ.కోట్ల వెనుక వాటాల మూటలు
ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయాన్ని మించి ఇక్కడ రూ.కోట్లతో దోపిడీ సాగిపోతోంది. దోపిడీ మూటలో వాటాల మాట దాగి ఉండటం బహిరంగ రహస్యం. రాజకీయ నాయకుల వత్తాసుతోనే కాంట్రాక్టర్ల దోపిడీ పర్వం నడుస్తోంది. టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి గ్రామ స్థాయి నేతల వరకు వాటాల మూటలు ముడుతున్నట్లు తెలుస్తోంది. తిలా పాపం తలా పిడికెడు పంపకాలు బాగానే సాగిపోతున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నం చేయకుండా సంకెళ్లు వేసేశారు. నోరు మెదిపితే ఇక్కడి నుంచి సాగినంపుతామన్న సంకేతాలు సైతం ఉన్నట్లు సమాచారం. కాగా.. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని దేవాదాయ ముఖ్య కార్యదర్శికి సైతం అధికారికంగా ఫిర్యాదులు వెళ్లాయి. ఫెస్టివల్ ఆఫీసర్‌గా సబ్ కలెక్టర్‌ను నియమించగా ఆయన దృష్టికి కూడా దోపిడీ వ్యవహారం వెళ్లింది. అయితే రాజకీయం అడ్డు రావడంతోనే అధికారులు మిన్నకుండి పోయారనే చర్చ ఉంది.

ఉరుకుందలో దోపిడీల జాతర!