
హాస్టళ్లలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు (అర్బన్): జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా బీసీ సంక్షేమం సాధికారత అధికారిణి కె ప్రసూన ఆదేశించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో మెగా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతి గృహ సంక్షేమ అధికారులు హాస్టళ్ళ పరిసరాలు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా, తాగునీరు కలుషితమైనా విద్యార్థులు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌డబ్ల్యూఓలందరూ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తరచూ హాస్టళ్లను పరిశీలిస్తుంటామని, ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం నెలకొంటే సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.