
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
● మొదటి సారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పెన్షనర్లు ● కమిటేషన్ పేరుతో దోపిడీ చేస్తుండటంపై రగిలిపోతున్న పెన్షనర్లు ● ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తుండటం పట్ల ఆందోళన ● రూ.20వేల లోపు వేతనాల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అందని సంక్షేమ పథకాలు ● ఐదు డీఏలు పెండింగ్, పీఆర్‌సీ లేదు, ఐఆర్ ఊసే కరువు
బయటకు చెప్పుకోలేక..
మోసాన్ని భరించలేక!
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కక్కలేక, మింగలేక సతమతం అవుతున్నారు. ఉద్యోగుల పక్షాన పోరాటం చేసి ఆర్థిక ప్రయోజనాలు సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దల కు కొమ్ముకాస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షనర్లు (విశ్రాంత ఉద్యోగులు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన ఏపీఎన్‌జీఓ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాడాల్సి ఉంది. అయితే సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండటం పట్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్‌లను సాధించుకోవడంలో పెన్షనర్లను చూసి నేర్చుకోవాలని ఆయా సంఘాల నేతలకు ఉద్యోగులు సూచిస్తుండటం గమనార్హం.
కమిటేషన్ పేరుతో దోపిడీ
కమిటేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను దోపిడీ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కమిటేషన్ తీసుకుంటారు. దీనిని అసలు, వడ్డీ సహా 15 ఏళ్లలో రికవరీ చేయాల్సి ఉంది. 11 ఏళ్ల 3 నెలల్లో ఈ మొత్తం రికవరీ పూర్తవుతుంది. అయితే 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కొన్ని నెలల క్రితం సుప్రీం కోర్టు కమిటేషన్ రికవరీ 11 ఏళ్ల 3 నెలలకే పూర్తి అవుతున్నందున 15 ఏళ్లు రికవరీ చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్డు ఆదేశాల తర్వాత ఐదారు నెలల పాటు కమిటేషన్ రికవరీని నిలుపుదల చేసింది. రెండు నెలలుగా ప్రతి ఉద్యోగి నుంచి స్థాయిని బట్టి రూ.4500 నుంచి రూ.8 వేల వరకు మళ్లీ రికవరీ చేస్తుండటం పట్ల పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అరకొర బకాయిలే విడుదల
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ఉద్యోగుల బకాయిలకు ఒకసారి రూ.1300 కోట్లు, మరోసారి రూ.7200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇప్పటికీ దాదాపు రాష్ట్రం మొత్తం మీద బకాయిలు రూ.28 వేల కోట్ల వరకు ఉండిపోయాయి. ఇప్పటి వరకు విడుదల చేసింది మొత్తం బకాయిలో 10 శాతం మాత్రమే. ఈ మాత్రం దానికే ఉద్యోగ సంఘాల నేతలు మహదానంద పడిపోతుండటం పట్ల ఉద్యోగుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 27 శాతం మధ్యంతర భృతి చెల్లించారు.
ఇవీ సమస్యలు..
కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడిచినప్పటికీ ఒక్క డీఏ కూడా చెల్లించని పరిస్థితి.
2024 మార్చి నాటికి ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఇప్పటి వరకు మధ్యంతర భృతి(ఐఆర్) ఊసే లేదు. 12వ పీఆర్‌సీ జాడ లేకుండా పోయింది.
ఉద్యోగులు మరణించినప్పుడు మట్టి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.
ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు నిలిచిపోయాయి. జీపీఎఫ్, పీఎఫ్ ఊసే లేకుండా పోయింది.
సరెండర్ లీవ్ బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉండిపోయాయి.
కనీసం మెడికల్ రీయింబర్స్‌మెంటు బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి.
రూ.20 వేల లోపు వేతనాలు తీసుకుంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే హామీ ఇచ్చి విస్మరించారు.
2024 జాన్ తర్వాత పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ మినహా ఇతరత్రా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు.
10 నెలల గ్రాట్యూటీ, కమిటేషన్ తదితరాలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
పదవీ విరమణ పొందిన ఒక్కో ఉద్యోగికి సగటున రూ.40 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది.