
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయండి
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాల ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన మంగళవారం ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజుతో కలిసి ఆలయ ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని, అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల వారు సహాయ సహకారం అందించాలని కోరారు. ఉరుకుందకు వచ్చే నాలుగు వైపులా రోడ్లకు మరమ్మతులు చేశారా? అని ఆర్‌అండ్‌బీ ఏఈ సాయిసురేష్‌ను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని డీసీని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ కట్టను పరిశీలించి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. తాగునీటి ఏర్పాట్లపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. సీఐ అశోక్‌కుమార్, డిప్యూటీ కమిషనర్‌తో కలిసి నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తుల స్నానాల ఘాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తహసీల్దారు రజినీకాంత్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్య అర్చకులు, ఆయాశాఖల అధికారులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.