
మోదీ భజన తప్ప ప్రజా సంక్షేమం ఏదీ?
● ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్న
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీకి భజన చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. నంద్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం.. డోన్‌లో జరిగే సీపీఐ నంద్యాల జిల్లా రెండవ మహాసభ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రామాంజనేయులు, సుంకన్న, బాబాఫకృద్దీన్, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 30, 31 తేదీల్లో డోన్‌లో జరిగే సీపీఐ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈనెల 24, 25వ తేదీల్లో వివిధ దేశాల నుంచి కమ్యూనిస్టు నాయకులతో విజయవాడలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను అదానీ కాంట్రాక్టర్లతో ప్రజలకు అంటగట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని, సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలగనూరు రిజర్వాయర్‌కు నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు శ్రీనివాసులు, నాగరాముడు, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.