
కోలుకోలేక రైతు మృతి
చిప్పగిరి: పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయ త్నించిన రైతు చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దౌల్తాపురం గ్రామానికి చెందిన కావలి రామాంజనేయలు (55)కు భార్య పుల్లమ్మ, కుమారుడు మహేష్‌తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రామాంజనేయులు కుటుంబ సభ్యులకు తెలియకుండా తమకున్న 15 ఎకరాల్లో మూడెకరాలను చిప్పగిరికి చెందిన వారికి రూ.15 లక్షలకు విక్రయ అగ్రిమెంటు రాసి ఇచ్చి అడ్వాన్సుగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం, క్రయవిక్రయాల్లో తేడాలు రావడంతో మనస్థాపానికి గురై ఆదివారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా పురుగు మందు తాగినట్లు గుర్తించి గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపారు.
కూతురిని వేధిస్తున్నారని కత్తితో దాడి
నంద్యాల: కూతురి వెంట పడుతూ వేధిస్తున్నారని ఇద్దరు మైనర్ బాలురుపై తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నంద్యాలలో మంగళవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీకి చెందిన మైనర్ బాలికను విశ్వనగర్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలురులు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాలిక వెంట పడటం, తరచూ ఇంటి వద్ద తిరుగుతూ అల్లరి పట్టిస్తుండటంతో విషయాన్ని కూతురు తన తండ్రికి తెలిపింది. గత కొన్ని రోజులుగా వారి ఆకతాయి చేష్టలను గమనిస్తూ వస్తున్న తండ్రి మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు తిరుగుతున్న ఇద్దరు మైనర్ బాలురులపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో ఇద్దరు మైనర్ బాలురులకు తీవ్ర గాయాలయ్యాయి. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.