
విష్ణు వర్గీయుడి దౌర్జన్యం
● రోడ్డు పనులు చేస్తున్న హిటాచీపై రాళ్ల దాడి
కర్నూలు: కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్దన్ రెడ్డి వర్గీయుడుగా చెప్పుకుంటున్న గార్గేయపురం వాసి ఓ కాంట్రాక్టు సంస్థకు చెందిన డ్రైవర్‌ను బెదిరించి హిటాచీపై రాళ్లతో దాడి చేశాడు. కర్నూలు మండలం గార్గేయపురం పొలిమేర అయ్యకుంట సమీపంలో హంద్రీనీవా కాలువకు ఉన్న ఎర్రమట్టిని టిప్ప ర్ల ద్వారా తరలించేందుకు హిటాచీ పని చేస్తుండగా గార్గేయపురం వాసి అక్కడికి వెళ్లి ‘ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎర్రమట్టి మా రెడ్డి అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు?’ అంటూ గురువారం సాయంత్రం డ్రైవర్‌ను తీవ్రంగా దూషించి హిటాచీపై రాళ్లతో దాడి చేయడంతో మొత్తం అద్దాలు ధ్వంసమయ్యాయి. కేతవరం–గార్గేయపురం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి దగ్గర కాలువ కట్టకు నల్లమట్టి రోడ్డు ఉన్నందున వర్షానికి టిప్పర్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడంతో అయ్యకుంట సమీపంలో కాల్వకు ఉన్న ఎర్రమట్టిని రోడ్డు ఏర్పాటుకు తరలిస్తుండగా గార్గేయపురంకు చెందిన విష్ణు వర్గీయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. హంద్రీనీవా కాలువకు ఉన్న ఎర్రమట్టిని తమ రెడ్డి అనుమతి లేకుండా ఎలా తరలిస్తారంటూ దౌర్జన్యానికి పాల్పడి బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతను గతంలో కూడా రైతులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంస్థల వారిని బెదిరించి ఘటనలో జైలుకు కూడా వెళ్లి మండలంలో సమస్యాత్మక వ్యక్తిగా మారాడు. పోలీసుల జాబితాలో కూడా సమస్యాత్మక వ్యక్తిగా ఉన్నప్పటికీ అధికార పార్టీలో కొనసాగుతుండటంతో అతని దౌర్జన్యాలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

విష్ణు వర్గీయుడి దౌర్జన్యం