
12 నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నాలుగు విభాగాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు. టైలరింగ్‌లో 31 రోజులు, ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్‌లో 31 రోజులు, బ్యూటీపార్లర్‌లో 35 రోజులు, జ్యూట్‌బ్యాగ్ తయారీలో 14 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు12 నుంచి శిక్షణా తరగతులు మొదలవుతాయన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు కర్నూలు శివారు బి.తాండ్రపాడులోని కెనరా బ్యాంకు–గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్‌డీఏ–టీటీడీసీ ప్రక్కన )లో, లేదా 9000710508, 63044 91236 నెంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయండి
కర్నూలు(సెంట్రల్): ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులను ఆదేశించారు. హంద్రీ, తుంగభద్రల నుంచి ఇసుక ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్నట్లు పత్రికల్లో వర్తాలు వస్తున్నాయని, వాటిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కథనాలపై స్పందించి నిల్వలను సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై వీఆర్వోలు సమాచారం ఇవ్వకపోతే వారిపైనా చర్యలు తప్పవన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నివేదికలు పంపాలని ఆదోని సబ్‌కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు టౌన్ డీఎస్పీ బాబుప్రసాద్, ఆర్‌టీఓ భరత్, మైనింగ్ అధికారి రవిచంద్, భూగర్భ జల శాఖ డీడీ శ్రీనివాస్, పీసీబీ ఈఈ పి.కిశోర్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థి ఆకస్మిక మృతి
కొలిమిగుండ్ల: కనకాద్రిపల్లెలో బీటెక్ విద్యార్థి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందాడు. వైఎస్సార్‌సీపీ నేత సూరపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు అఖిలేశ్వరరెడ్డి(19) ఢిల్లీలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ పూర్తి చేసుకొని సెలవులు కావడంతో రెండు నెలల క్రితం కనకాద్రిపల్లెకు వచ్చాడు. అయితే నాలుగు రోజుల క్రితం నరాలకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో కర్నూలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రెండు రోజుల నుంచి గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఉదయం వెళ్లి ప్లూయిడ్స్ ఎక్కిస్తున్న సమయంలో అఖిలేశ్వరరెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తాడిపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి వద్దకు తీసుకురాగానే గ్రామస్తులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి,జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పేరం నందకిషోర్‌రెడ్డి, నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి, సత్తిగారి రామిరెడ్డి, వివిధ గ్రామాల నాయకులు విద్యార్థి మృత దేహం వద్ద నివాళులర్పించి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించారు.