
పెద్దాసుపత్రి కార్డియాలజీలో అరుదైన చికిత్స
● మూసుకుపోయిన ఎడమ భుజం రక్తనాళానికి స్టెంట్
కర్నూలు(హాస్పిటల్): ఎడమ భుజం నుంచి చేతికి వెళ్లే రక్తనాళం మూసుకుపోవడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు స్టెంట్ వేసి సమస్యను సరిచేశారు. శుక్రవారం ఆసుపత్రిలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి హెచ్‌ఓడీ డాక్టర్ ఆదిలక్ష్మి మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మిడుతూరుకు చెందిన చంద్రావతి(45)కి గత నెల 29న కళ్లు తిరగడం, ఎడమ చేతినొప్పితో ఆసుపత్రికి వచ్చింది. వైద్యపరీక్షలు చేసిన కార్డియాలజి వైద్యులు భుజం నుంచి చేతికి వెళ్లే రక్తనాళం(సబ్ క్లేవియాన్ ధమని)లో రక్తం గడ్డకట్టి పూర్తిగా మూసుకుపోయినట్లు గుర్తించారు. ఈ సమస్యకు తమ వైద్య బృందం ఈ నెల 14న సబ్ క్లేవియన్ ధమనికి యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేశారు. చికిత్సకు ప్రైవేటులో అయితే రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఆసుపత్రిలో ఉచితంగా స్టెంట్ వేశాం. ఆమె పూర్తిగా కోలుకుంది. సబ్ క్లేవియాన్ ధమనిలో స్టెంట్ వేయడం చాలా అరుదుగా జరుగుతుంది’ అని వివరించారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ లలితకుమారి, డాక్టర్ రాజ్‌కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.