
మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ చెప్పారు. శుక్రవారం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరి, రిక్రియేషన్ గదిని ప్రారంభించారు. అనంతరం హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా అవసరాలను కళాశాలల్లోని నిధులతో మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. వైద్యులు సబ్జక్టుల వారీగా అప్‌డేట్‌గా ఉండాలని, వారు సైతం క్రమశిక్షణ పాటించి విద్యార్థుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రూ.1కోటి నిధులు ఇస్తున్నామని, వీటితో పరిశోధనలకు ప్రాదాన్యం ఇవ్వాలన్నారు. కర్నూలు, గుంటూరు, వైజాగ్‌లలోని కళాశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో స్కిల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నామని, పర్ల ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అకడమిక్ డీఎంఈ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ వీసీ సహకారంతో మెడికల్ కాలేజీల్లో ప్రమాణాలు, పరిశోధనలు, వసతులు, వైద్య విద్యార్థుల కరిక్యులమ్ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాలలను తనిఖీలు నిర్వహించి అక్కడి ల్యాబ్‌లు, క్లినికల్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసుధీర్, డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సింధియా శుభప్రద తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ
డాక్టర్ పి.చంద్రశేఖర్