
తమ్ముళ్లు పంచుకున్నారు!
నందవరం: రైతులకు చేరాల్సిన ఎరువులను తెలుగు తమ్ముళ్లు పంచుకున్న ఘటన గురజాల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఖరీఫ్‌లో వివిధ పంటలు సాగు చేసిన రైతులు తమ అవసరం మేరకు రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు గ్రామానికి 300 బస్తాల ఎరువుల లారీ చేరుకుంది. అయితే వీఏఏ స్టాక్ వచ్చిన విషయాన్ని ఏఓకు సమాచారం ఇవ్వక పోవడంతో పాటు లారీ రైతు సేవా కేంద్రానికి కూడా తరలించలేదు. ఊరి మధ్యలోనే ఉంచి టీడీపీ నేతలకు తలా పది సంచులు మేర ఎత్తించడంతో రైతులు అవాక్కయ్యారు. ఎరువుల కోసం ఎదురు చూస్తున్న తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరత లేదంటున్న ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీని పరిశీలించి సామాన్య రైతులకు ఎరువులు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిణి సరితను వివరణ కోరగా వీఏఏపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇండెంట్ మేరకు ఎరువులు సరఫరా చేస్తున్నామని, బుధవారం మరో 300 సంచుల యూరియా గ్రామానికి చేరుకుంటుందన్నారు.