
‘పొగ’పట్టిన కంపెనీలు!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా గత సంవత్సరంలో పండించిన పొగాకు అమ్ముడుపోని పరిస్థితి. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పొగాకు నిల్వలను కాపాడుకోవడం రైతులకు భారమవుతోంది. కర్నూలు జిల్లాలో 5,200 టన్నులు, నంద్యాల జిల్లాలో 4,500 టన్నుల పొగాకు నిల్వలు ఇప్పటికీ కొనుగోలుకు నోచుకోకపోవడం చూస్తే కంపెనీల నిర్లక్ష్యం అర్థమవుతోంది. ఈ విషయంపై గత ఏప్రిల్ 25న ‘సాక్షి’లో ‘సాగుకు వెన్నుతట్టి.. కొనుగోళ్లకు పొగపెట్టి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య స్పందించారు. అదే నెల 28న కంపెనీల ప్రతినిధులతో సమావేశమై నెల రోజుల్లోపు పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. సరిగ్గా నెల రోజులకు జేసీ నవ్య ఈ నెల 28న తిరిగి పొగాకు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎక్కడికక్కడ రైతుల వద్ద పేరుకుపోయిన పొగాకు నిల్వలను చూస్తే జేసీ ఆదేశాలను కంపెనీలు పాటించలేదనే విషయం అర్థమవుతోంది.
ఇప్పటి వరకు కొనుగోలు 50,874 టన్నులే..
2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ఎకరాకు సగటున 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ప్రకారం కర్నూలు జిల్లాలో 32,823 టన్నులు, నంద్యాల జిల్లాలో 27,778 టన్నుల దిగుబడి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 60,601 టన్నుల దిగుబడి రాగా.. కొనుగోలు చేసిన పొగాకు 50,874 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. 2025–26 ఖరీఫ్ సీజన్ మరో నాలుగు రోజుల్లో మొదలవుతోంది. అయితే ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 9,227 టన్నుల వరకు పొగాకు అలాగే ఉండిపోయింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 4,058 టన్నుల పొగాకు నిల్వలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కంపెనీలు ప్రోత్సహించడంతోనే పెరిగిన సాగు
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగును ప్రోత్సహించడంలో ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ), వర్జీనీయా సుల్తాన్ టొబాకో(వీఎస్‌టీ), జీపీఐ, ప్రీమియర్ టొబాకో ప్యాకర్స్, అలియన్స్ కంపెనీలు ప్రధానమైనవి. 2023–24లో కర్నూలు జిల్లాలో 9,586 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 8,791 ఎకరాల్లో మాత్రమే పొగాకు సాగయింది. ఆ ఏడాది సాగు తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల క్వింటాకు రూ.20 వేల వరకు ధర లభించింది. డిమాండ్‌కు అనుగుణంగా పొగాకు లేకపోవడంతో 2024–25లో పొగాకు సాగును కంపెనీలు ప్రోత్సహించాయి. ఇందువల్ల సాగు భారీగా పెరిగింది. ఊహించిన దానికంటే సాగు పెరగడంతో కంపెనీలు కొనుగోళ్లలో అలసత్వం వహించాయి. రాజకీయ నేతలు, వారి సిఫారసులు ఉన్న వారి పొగాకు కొనుగోలు చేసి, సాధారణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికీ పొగాకు నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి.
సాగును ప్రోత్సహించికొనుగోళ్లకు వెనుకడుగు
ఉమ్మడి జిల్లాలో 60,601 టన్నుల పొగాకు దిగుబడులు
ఇప్పటి వరకు కొనుగోలు 50,874 టన్నులే..
‘సాక్షి’ కథనంపై స్పందించిన జేసీ
నెల రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశాలు
ఆ దిశగా చర్యలు చేపట్టని కంపెనీలు
సాగు పెరగడంతోనే ధరలో కోత
2024–25లో పండించిన పొగాకు ధరను కంపెనీల అసోసియేషన్ క్వింటాకు రూ.15,500లుగా నిర్ణయించింది.
నాణ్యత బాగున్నప్పటికీ రూ.10వేల నుంచి రూ.13వేల వరకు ధర మాత్రమే లభిస్తోంది.
మొదట్లో క్వింటాకు రూ.14వేలు–రూ.15వేల వరకు ధర వేసిన కంపెనీలు ఇప్పుడు క్వింటాకు రూ.2వేల–రూ.2,500 వరకు కోత పెడుతున్నాయి.
రికార్డు స్థాయిలో సాగు కావడంతోనే నిర్ణయించిన ప్రకారం కొనుగోలు చేయడానికి కంపెనీలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తేమ శాతం, ఆకు విరగడం, ఇతర నాణ్యత ప్రమాణాలను బూచిగా చూపి ధరను అడ్డంగా కోసేస్తున్నారు.
క్వింటా కూడా అమ్ముడుపోలేదు
రెండు ఎకరాల్లో పొగాకు సాగు చేశాం. ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడితే 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇంతవరకు క్వింటా కూడా అమ్ముడుపోలేదు. నిల్వలను వర్షాల నుంచి కాపాడుకునేందుకు చుక్కలు చూడాల్సి వస్తోంది. పొగాకు కొనుగోలు చేయాలని కంపెనీల చుట్టూ తిరుగుతున్నాం. ఇటీవల జేసీని కలసి న్యాయం చేయాలని కోరాం. –పి.వెంకటరాముడు, ఉల్చాల, కర్నూలు మండలం

‘పొగ’పట్టిన కంపెనీలు!

‘పొగ’పట్టిన కంపెనీలు!