
పురుగు మందు తాగి చస్తాం
● పేదల కడుపు కొట్టేందుకు రాజకీయాలు చేస్తున్నారు ● కన్నీరు పెట్టిన దళిత పారిశుద్ధ్య మహిళా కార్మికులు ● వెల్దుర్తి సీహెచ్‌సీ ఎదుట నిరసన
వెల్దుర్తి: ‘‘ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా కుటుంబాలకు దూరంగా ఉండి కరోనా సమయంలో పారిశుద్ధ్య పనులు పనిచేశాం.. మా సేవలను మరచి మమ్మల్ని తొలగించాలని రాజకీయాలు చేస్తున్నారు.. మాకు న్యాయం జరగకపోతే మేమందరం కుటుంబ సమేతంగా పురుగు మందు తాగి చస్తాం.’ అంటూ దళిత పారిశుద్ధ్య మహిళా కార్మికులు ప్రశాంతి, రాధ, కృష్ణవేణి కన్నీరు పెట్టారు. పిల్లల్ని వెంట బెట్టుకుని వెల్దుర్తి సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ – సామాజిక ఆరోగ్య కేంద్రం) వద్దకు వచ్చి మంగళవారం నిరసన తెలిపారు. ప్లాస్టిక్ కవర్‌లో తెచ్చిన పురుగు మందు డబ్బాను కూడా విలేకరులకు చూపారు.. బాధిత మహిళలు తెలిపిన వివరాలు వారి మాటల్లోనే.. ‘‘ మమ్మల్ని 2019లోనే శానిటేషన్ వర్కర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చిన్న సమస్య లేకుండా పనిచేసుకుంటూ వచ్చాం. ప్రాణాలు పోతాయని తెలిసినా కరోనా రోగులతో కలిసి ఆసుపత్రిలో విధులు నిర్వహించాం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. మా భర్తలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఒకే కారణంతో మాపై కక్ష కట్టారు. ఇది తెలిసి మేం టీడీపీ నాయకులకు మా కష్టాన్ని విన్నవించాం. ఎమ్మెల్యే శ్యాంబాబు కూడా ‘ పేదల కడుపు కొట్టమమ్మా, మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోండి’ అంటూ హామీ ఇచ్చారు. చివరకు మా కాంట్రాక్టరు శివప్రసాద్ ‘పై నుంచి ఒత్తిడి పెరిగిందమ్మా, ఎమ్మెల్యే మనుషులంటూ, పీఏ అంటూ మిమ్మల్ని తీసేయమని బెదిరింపులు వస్తున్నాయి. నేను ఏమీ చేయలేను’ అంటూ సమాధానమిచ్చాడు. మాకు న్యాయం జరగకపోతే మేమందరం కుటుంబ సమేతంగా పురుగుల మందు తాగి చస్తాం.’’ అంటూ కన్నీరు పెట్టారు.