
‘పురాతన’ ఆనవాళ్లు ఛిద్రం చేయొద్దు
ఓర్వకల్లు: పురాతన రాతి చిత్రాల ఆనవాళ్లను ఛిద్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శివాలయ ప్రాంతంతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను కేతవరం గ్రామస్తులు కోరారు. కేతవరం గ్రామ రెవెన్యూ పరిధిలో మైనింగ్ విస్తరణ పనులకు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ విద్యాసాగర్ ఆద్వర్యంలో జరిగిన సమావేశానికి ఆర్‌డీఓ సందీప్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ కిషోర్‌రెడ్డి, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ సందీప్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో 288 సర్వే నంబర్‌లో 20.24 హెక్టార్లలో సిలికా శాండ్, క్వార్ట్జ్ తవ్వకాల కోసం ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుందన్నారు. ప్రస్తుతం అదే సర్వే నంబర్‌లో సిలికా శాండ్, క్వార్ట్జ్ మిశ్రమాన్ని తయారు చేయుట కోసం పనులను విస్తరించుటకు ప్రతిపాదనలు పంపామన్నారు. కేతవరం గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ గోవర్ధన్ కోరారు. పంటలకు ఎలాంటి నష్టం జరుగకుండా బ్లాస్టింగ్ పనులు చేయాలని ప్రజలు విన్నవించారు. కేతవరం నుంచి కన్నమడకలకు రాకపోకల నిమిత్తం రహదారిని నిర్మించాలని కోరారు. మైనింగ్ విస్తరణను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు చెప్పారు.
● అధికారులకు కేతవరం గ్రామస్తుల వినతి