
తుంగభద్ర జలాశయంలో చేరిన వరద నీరు
● మంత్రులు బుగ్గన, గుమ్మనూరు జయరాం
కర్నూలు(సెంట్రల్): విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలందరికీ సకల శుభాలుకలగాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదివారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రతి కుటుంబ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మట్టి గణపతిని పూజించి వినాయక చవితిని పర్యావరణ హితగా జరుపుకోవాలని సూచించారు.
చేపలవేటకు వెళ్లి గిరిజనుడి మృతి
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ శివారులోని రుద్రకోడు చెంచు గూడెంకు చెందిన టోపి చిన్న గొలుసు (37)ప్రమాదవశాత్తు వెలుగోడు బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం చేపల వేట కోసం రిజర్వాయర్ వద్దకు వెళ్లిన ఆయన రిజర్వాయర్‌లో దిగేటపుప్డు జారి పడి బురదలో కూరుకు పోయి మరణించినట్లు తెలుస్తోంది. వెలుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య నాగమ్మ, ఇరువురు సంతానం ఉన్నారు.
టీబీ డ్యామ్‌లో 64 టీఎంసీలు
హొళగుంద: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయంలో 64 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతుంది. 1,633 అడుగులతో 105.788 టీఎంసీల డ్యాం పూర్తి మట్టానికి గాను ఆదివారం 1,621 అడుగులతో 64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. ఇన్‌ఫ్లో 1,739 క్యూసెక్కులుండగా, ఔట్‌ఫ్లో 9,935 క్యూసెక్యులుంది. ఇక దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు సంబంధించి ఆంధ్ర కాలువ ప్రారంభమయ్యే 250 కి.మీ (హాన్వాళ్ సెక్షన్) వద్ద 544 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
కారును ఢీకొన్న లారీ
● ఆదోని జడ్జితోపాటు మరో ఇద్దరికి గాయాలు
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని చిలంకూరు గ్రామ సమీపాన ఆదివారం కారును లారీ ఢీకొనడంతో ఆదోని సీనియర్ సివిల్ జడ్జి శైలజతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎర్రగుంట్ల పట్టణ సీఐ ఈశ్వరయ్య తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని కౌతాళం గ్రామానికి చెందిన శైలజ ఆదోని సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తల్లితో కలిసి కారులో కడప వైపు వెళ్తుండగా ఎదురుగా ఎర్రగుంట్ల వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో కారు డ్రైవరు తలారీ సుధాకర్, జడ్జి శైలజ, ఆమె తల్లి వెంకటసుబ్బమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారు కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ తలారీ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మోటార్ల విద్యుత్ తీగలు చోరీ
జూపాడుబంగ్లా: ఏబీఆర్ కాల్వ వెంట ఉన్న 60 మంది రైతుల విద్యుత్ మోటార్లకు చెందిన తీగలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తూడిచెర్ల, కనకయ్యకొట్టాల, మిట్టకందాల, బుద్దానగర్ గ్రామాలకు చెందిన బాధిత రైతులు చెన్నారెడ్డి, ఎల్లాల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సూరి, పిచ్చయ్య, ప్రసాదుతో పాటు మరి కొందరు రైతుల విద్యుత్ మోటార్ల తీగలు చోరీకి గురయ్యాయి. గ్రామాలకు సమీపంలో ఏబీఆర్ కాల్వ ఉండటంతో దాని వెంట పొలాలున్న రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్ల విద్యుత్ తీగలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించుకొని చోరీకి పాల్పడ్డారు. దీంతో విద్యుత్ మోటార్లు ఆడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఆరు మాసాల క్రితం విద్యుత్ తీగలను కత్తిరించుకొని వెళ్తున్న దొంగలను తూడిచెర్ల గ్రామానికి చెందిన రైతులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దొంగలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని రైతులు విమర్శిస్తున్నారు. దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు
● ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత
కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడితే వాతావరణం కలుషితమవుతుందని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సెమినార్ హాల్‌లో ఇన్‌పుట్ డీలర్లకు దేశీ డిప్లొమ కోర్సుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అఽతిథిగా హాజరైన ఆత్మ డీపీడీ శ్రీలత మాట్లాడుతూ... ఇన్‌పుట్ డీలర్లు సమగ్ర ఎరువుల యాజమాన్యంపై అవగాహన పెంచుకుని రైతులకు వివరించాలని పేర్కొన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ కార్యక్రమ సమన్వకర్త జయచంద్ర మాట్లాడుతూ... భాస్వరం ఎరువులు పైపాటుగా వాడటం వల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంద న్నారు. ఇన్‌పుట్ డీలర్లకు వ్యవసాయ పంచాంగాలను పంపిణీ చేశారు.