పాపం.. పసివాళ్లు | - | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాళ్లు

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

ప్రక్షాళనతోనే గాడిలోకి.. చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ శిశుగృహ సిబ్బంది మధ్య విభేదాలు చిన్నారుల ఆలనా పాలనను పట్టించుకోని వైనం అంతంత మాత్రంగానే అమలవుతున్న మెనూ

ప్రక్షాళనతోనే గాడిలోకి..

మచిలీపట్నంటౌన్‌: వారంతా పదేళ్లలోపు చిన్నారులు.. నా అన్నవారు లేని అభాగ్యులు.. ప్రభుత్వ శిశుగృహంలో వసతి పొందుతున్న ఆ పసివారి ఆలనా పాలన చూడాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మధ్య విభేదాల నేపథ్యంలో చిన్నారుల ఆకలిదప్పులను విస్మరిస్తున్నారు. మచిలీపట్నం నగరంలోని ప్రభుత్వ శిశుగృహ నిర్వహణపై ఆరోపణలు వినవస్తున్నాయి. సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయని, ఫలితంగా శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న నాలుగు నుంచి పదేళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది చిన్నారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలు, వంట సామగ్రి ఉన్నా చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారులకు పాలకు బదులు గంజి ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. శిశుగృహలో ఆరుగురు ఆయాలు, సామాజిక కార్యకర్త పనిచేస్తున్నారు. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సెలవులు పెడుతూ చిన్నారులను సాకడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పలువురు సిబ్బంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారు కావడంతో వారి వ్యవహార శైలి ఇలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

పరికరాల వినియోగంలోనూ అలసత్వం

శిశుగృహలోని పలు గృహోపకరణలను వినియోగించడంలో ఇక్కడ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాషింగ్‌ మిషన్లలో నిర్లక్ష్యంగా డైపర్లను పడేస్తున్నారు. ఫలితంగా ఇటీవల కాలంలో మూడు వాషింగ్‌ మిషన్లు మూలకు చేరాయి. మిక్సీలు సైతం మరమ్మతులకు గురయ్యాయి. మరో వైపు శిశుగృహానికి దాతలు ఇస్తున్న వస్తువులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల దాతలు ఇస్తున్న ఆహార పదార్థాలతో పాటు వెండి, బంగారు వస్తువులను సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే పలు వురు విమర్శిస్తున్నారు. నిబంధన ప్రకారం దాతలు నుంచి వితరణలు తీసుకోకూడదు. దీనికి భిన్నంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారని, కొంత మంది సిబ్బంది ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

శిశుగృహం సిబ్బంది వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. కొంత మంది ముందస్తు సమా చారం లేకుండానే సెలవు పెట్టేస్తున్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. చిన్నారులకు దాతలు వెండి, బంగారు వస్తువులు ఇవ్వలేదు. వస్తువులు పక్కదారి పట్టలేదు. చిన్నారులకు గంజి ఇవ్వడం అవాస్తవం. మెనూ ప్రకారమే వారికి ఆహారం అందిస్తున్నాం. కొంత మంది కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారు.

– ఎం.నూర్జహాన్‌ రాణి,

ఐసీడీఎస్‌ కృష్ణాజిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌

స్థానిక శిశుగృహలో సిబ్బంది వ్యవహారంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఇబ్బందులు తొలగాలంటే కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ దృష్టిసారించి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడి సిబ్బందిని ఇంకా కొనసాగిస్తే ఇలానే ఎప్పుడు విభేదాలతో వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి తక్షణమే శిశుగృహ వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement