భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు మృతుడి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలో గురువారం రాత్రి విజయవాడ కొత్తపేట ప్రాంతంలో వీచిన బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్తు వైరు తెగి పడి ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్ట కరమని విద్యుత్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం సాక్షిలో ‘విద్యుత్తు తీగలు.. మృత్యు ఘాతాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర విచాణ నిర్వహించి, బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకొంటామని ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) హనమయ్య తెలిపారు. భవిషత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు లైన్లు, స్తంభాలు, ఇతర విద్యుత్తు పరికరాల స్థితిగతులను క్షుణంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.


