ఈ ఏడాది రూ.115.68 కోట్ల బడ్జెట్ బంటుమిల్లి, శేరీలక్ష్మీపురంలో బ్రాంచ్ భవనాల నిర్మాణానికి స్థలాల సేకరణ మూడు కొత్త బ్రాంచ్‌ల నిర్మాణానికి చర్యలు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులకు ఉపశమనంగా రూ.182.31 లక్షల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపినట్లు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఫంక్షన్ హాలులో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాజనసభ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కేడీసీసీ బ్యాంకు కమర్షియల్ బ్యాంకులకు దీటుగా 5వ స్థానంలో ఉందన్నారు. అయితే కేడీసీసీ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ స్థానం, దేశంలో నాల్గవ స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు. రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన తమ బ్యాంక్ జనతా ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఆ రైతు తీసుకున్న పంట రుణంపై కూడా వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తున్నామన్నారు.
డిజిటల్ సేవలను విస్తరిస్తున్నాం
కేడీసీసీ బ్యాంకు ద్వారా డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఫోన్‌పే క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. మహాజనసభ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.115.68 కోట్లు బడ్జెట్‌కు ఆమోదం తెలిపామన్నారు. బంటుమిల్లి, శేరీలక్ష్మీపురం పీఏసీఎస్‌ల నుంచి స్థలాలు కొనుగోలు చేసి బ్రాంచ్ భవనాలను నిర్మించేందుకు ఆమోదం తెలిపామన్నారు. రెడ్డిగూడెం మండలం వెల్లటూరు, శేరీలక్ష్మీపురం ప్రాంతాల్లో మూడు కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2026–27వ సంవత్సరానికి సంబంధించి మేనేజర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయి వరకు ఉద్యోగుల వేతన సవరణలకు అమూల్యమైన సహకారం అందించామని చైర్మన్ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో సభ్యులకు అంత్యక్రియల ఖర్చు కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం విద్యా రుణాలు, గృహ రుణాలు, వ్యవసాయ భూమి కొనుగోలు రుణాలు వంటి పలు రుణ సదుపాయాలను అందిస్తున్నామన్నారు. అనంతరం నవాబ్‌పేట సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయనకు రెండు నిమిషాలు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఎ.శ్యామ్‌మనోహర్, డీసీవో చంద్రశేఖరరెడ్డి, జనరల్ మేనేజర్లు రంగబాబు, బీఎల్ చంద్రశేఖర్, ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీల అధ్యక్షులు పాల్గొన్నారు.


