దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలలో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. తొలి విడత లెక్కింపులో రూ.1.27కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన కానుకల, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపులో మొత్తం రూ. 1,27,90, 645 నగదు, 18 గ్రాముల బంగారం, 2.474 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
పైడమ్మతల్లి హుండీ ఆదాయం రూ.5.47లక్షలు
పెడన: పట్టణ పరిధిలోని పైడమ్మ తల్లి ఉత్సవాలు ముగియడంతో బుధవారం అధికారుల పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించినట్లు ఈఓ గోవాడ వెంకటకృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన 70 రోజుల పైడమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రూ. 5,47,633 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. అలాగే 700 మిల్లీగ్రాముల బంగారం, 128 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయన్నారు. ఉత్సవాలు అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డి. వాయునందన్‌రావు పాల్గొన్నారు. పీవీన్‌వీ ప్రసాదరావు పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం లెక్కింపు


