ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్టు
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు నమోదుచేసిన పెనమలూరు పోలీసులు వారిని అరెస్టు చేశారు. సీఐ జె.వెంకటరమణ కథనం మేరకు..పెదపులిపాక గణపతినగర్‌లోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరుగురు వ్యక్తులు గంజాయితో ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. స్పందించిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడిచేసి గంజాయితో ఉన్న కానూరు మురళీనగర్‌కు చెందిన చెందిన జువ్వనపూడి శశికాంత్, ఉయ్యూరు వెంకటవంశీకృష్ణ, ప్రసాదంపాడుకు చెందిన వి.దుర్గారావు, ఆకుల వెంకటమాధవ్, పెదపులిపాక గణపతినగర్‌కు చెందిన ఆకులపల్లి మౌనిక, పెనమలూరు పల్లిపేటకు చెందిన గోగం ఫణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా కట్టి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది. నిందితుల వద్ద 2,250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గన్నవరంలో గంజాయి స్మగ్లర్ అరెస్టు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పూణేకు చెందిన దీపక్ తుపే ఒడిశాలో రాజ్‌కుమార్, సురాన్‌కర్ణ వద్ద 112 కిలోల గంజాయి కొన్నాడు. పూణేలో వైష్ణవిలవన్‌కు అందిం చేందుకు కారులో ఒడిశా నుంచి బయలుదేరాడు. దీపక్ తుపే గన్నవరం సమీపంలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద చేరుకున్న సమయంలో పోలీ సులు వాహనాలను తనిఖీచేస్తుండటంతో కంగారుపడ్డాడు. అతడిని గమనించిన గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్ కారును తనిఖీ చేయగా రూ.5.60 లక్షల విలువైన 112 కిలోల గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీపక్ తుపేపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒడి శాకు చెందిన రాజ్‌కుమార్, సురాన్‌కర్ణ, పూణేకు చెందిన వైష్ణవిలవన్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్‌ను పట్టుకున్న గన్నవరం పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బి.వి.శివప్రసాద్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


