క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్– నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ప్రారంభ మ్యాచ్‌లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూ లుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు.


