ఐదంచెల సాగు.. లాభాలు బాగు
●ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం
●సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి
ప్రచారకుడు విజయరామ్
గూడూరు: వ్యవసాయంలో మూస పద్ధతికి స్వస్తి పలికి ఐదంచెల సాగు ద్వారా రైతులు లాభాలు గడించొచ్చని నిరూపిస్తున్నారు సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు ఎం.విజయరామ్. గూడూరు మండలం తరకటూరులోని సౌభాగ్య గో సదన్‌లో చేపట్టిన ఐదంచెల సాగు విధానం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎకరాకు రూ.3 లక్షల నికర ఆదాయం పొందొచ్చని చేసి చూపించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఐదంచెల సాగు విధానంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
60 x 60 నమూనా
ఐదంచెల సాగు విధానంలో 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధం చేశారు. ఎకరం పొలాన్ని 7 1/2 అడుగుల మడులుగా విభజించారు. ప్రతి మడి తరువాత చిన్నపాటి కలువను తవ్వించారు. కాలువ మధ్యలో ఉన్న దిబ్బలపై పసుపు నాటి, అంతర పంటలుగా 20 అరటి, 36 మునగ, 16 బొప్పాయి, వట్టివేరు తదితర పంటలను సాగు చేస్తున్నారు. సాధారణ సాగు పద్ధతిలో ఉపయోగించే నీటిలో ఐదంచెల సాగు పద్ధతిలో మూడు శాతం నీటిని మాత్రమే అవసరం అవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో పంటల నుంచి లాభాలు గడించొచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు.
6 టన్నుల పసుపు దిగుబడి
వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన పసుపు పంట ద్వారా దాదాపు ఆరు టన్నుల పసుపు దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయరామ్. దీంతో పాటు సాగు చేస్తున్న మునగ, వట్టివేరుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక మునగ చెట్టుకు సరాసరి రెండు కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో రూ.300 పలుకుతుండగా వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన 36 చెట్ల ద్వారా 72 కిలోల మునగాకు దిగుబడి వస్తుంది. దీనిని డ్రయ్యర్‌లో పొడి చేయడం ద్వారా ఆకు పాడవకుండా పొడి చేసి ఇతర ప్రాంతాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు.
81 రకాల మొక్కల సాగు
ఐదంచెల విధానంలో మొత్తం 81 రకాల పండ్ల, ఆకుకూరలు, కూరగాయలు, తదితర మొక్కలు పెంచేలా విజయరామ్ ఏర్పాట్లు చేశారు. ప్రతి 60 అడుగులకు ఒక మామిడి, నేరేడు, సపోటా, పనస, మధ్యలో జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అంజీర, ఉసిరి, బిల్వ, మారేడు వంటి చెట్లను పెంచుతున్నారు. వీటి మధ్య ఆవాలు, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, సోంపుతోపాటు తోటకూర, గోంగూర, బచ్చలి కూర, మొంతి కూర, కొత్తిమీర, ఎర్రతోటకూర, పచ్చతోటకూర, పాలకూర తదితర ఆకుకూరలు, బెండ, టమాట, వంకాయ, చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ, దోస కాయ, నేతి బీర కాయ వంటి కూరగాయలు, అల్లం, కంద, ముల్లంగి, బీట్‌రూట్, చామదుంప, వంటి దుంపలు సాగు చేస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ విధానంలోనే సాగు
విజయరామ్ సాగు చేస్తున్న పంటలకు ఎక్కడా రసాయనాలు వినియోగించడం లేదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వినియోగించే ఆవు పేడ, మూత్రంతో పాటు ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసి వాటి ద్వారానే పంటలను సాగు చేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడులకు మార్కెట్‌లో మంచి రేటు లభిస్తోంది. ఈ విధా నంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యవంతమైన జీవనం సాగించడానికి అవకాశం లభిస్తుందని, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని విజయరామ్ పేర్కొంటున్నారు.
కార్పొరేట్ కొలువుల వైపు పరిగెత్తుతూ నగరాల్లో కాలుష్య కోరల్లో క్షణం తీరిక లేని జీవనం గడుపుతున్న యువతను వ్యవసాయ రంగంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని విజయ రామ్ అంటున్నారు. కూలీలపై ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తే ఒక్క ఎకరం పొలంలో ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం సాధించొచ్చని పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఐదంచెల విధానం రూపొందించడం జరిగిందని ఆయన అన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని తన ద్వారా మరింత మందికి తీసుకువెళ్లాలన్న బృహత్తర లక్ష్యంతో డిసెంబర్ 15 నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని రైతులకు ఐదంచెల విధానంపై క్షేత్ర స్థాయ అవగాహన కార్యక్రమం రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
ఐదంచెల సాగు.. లాభాలు బాగు
ఐదంచెల సాగు.. లాభాలు బాగు


